పులిహోర అంటే నాకు చాలా ఇష్టం. పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు బహుశా తెలుగు నేలపై ఉండకపోవచ్చు. పులిహోర మన జీవితాలలో అంతలా పెనవేసుకుపోయింది. మనకే కాదు, ప్రత్యక్ష దైవం అయిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కి కూడా పులిహోర అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యము.
నా వరకు నాకు ఎంత ఇష్టం అంటే, పులిహోర తింటే కవిత్వం వచ్చేంతలా. అలాంటిదే ఈ చిన్న కవిత.
అమ్మ వండినా ! అమ్మమ్మ వండినా !!
భార్య వండినా ! బామ్మ వండినా !!
తరగలేదు నీ రుచి తరాలు మారినా !!
ఎన్ని వంటలున్నా తగ్గలేదు నీకు ఆదరణ !!
వేడి వేడి పులిహోర
వేంకటేశ్వర స్వామికి
కూడా ఎంతో ఇష్టం అట !!
తాతలు తిన్నారు తనివి తీరా !
తండ్రులు తిన్నారు కడుపార !
మనమూ తిన్నాము మనసారా !!
దేవుడు సైతం నచ్చిన వంట !
ఇంట్లో అందరు మెచ్చిన వంట !
తెలుగు నాట
పులిహోర కి సాటి లేదంట !!
మేము పులిహోరని ప్రేమతో "చిత్రాన్నము" అని పిలుస్తాము. ఆ పేరు వింటే అదొక అలౌకిక ఆనందము. నాకైతే పులిహోరని వండడము, నివేదించడము, ఆరగించడము పూజ చేయడం లాంటిదనుకోండి.
పులిహోర చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఆయా కాలాల్లో మనకు అందుబాటులో ఉన్న కాయలతో, వస్తువులతో కలిపి మనం వేరు వేరు రకాలుగా పులిహోరని తయారు చేసుకోవచ్చు.
చింతపండు పులిహోర
నిమ్మకాయ పులిహోర
మామిడికాయ పులిహోర
ఉసిరికాయ పులిహోర
చింత చిగురు పులిహోర
బొరుగుల పులిహోర
అటుకుల పులిహోర
దబ్బకాయ పులిహోర
నూకల పులిహోర
Comments
Post a Comment